ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు. బీజేపీ సర్కారు ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరు, పార్లమెంటు ఉభయ సభల్లో ఆ పార్టీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాని అనాగరికమేనని మండిపడ్డారు.
ఈ సర్కారు గురించి మాట్లాడాలంటే తనకు అనాగరికం అనే మాట వెంటనే స్ఫురిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ తీరు అన్యాయం, అక్రమం మాత్రమే కాదని, అది ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా పరిణమించిందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని అది కుంచించివేస్తున్నదని అమర్త్యసేన్ అన్నారు. ది వైర్ వార్తాసంస్థ కోసం ఇటీవల కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మోదీ సర్కారును ఎండగట్టారు.
భారత ప్రభుత్వం అతి సంకుచిత సమూహవాదంతో నడుస్తున్నదని తాను ఫ్రెంచ్ పత్రిక లె మాండ్‌కు ఇంటర్వ్యూలో చెప్పిన సంగతిని ప్రస్తావించారు. బీజేపీ సర్కారు ముస్లింలపై దాడులు చేస్తూ, హిందూదేశ భావనను ముందుకు తెస్తున్నదని తెలిపారు. లె మాండ్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను విపులీకరిస్తూ, భారతదేశం ఎప్పుడూ బహుళ జాతుల సమూహమేనని నొక్కిచెప్పారు.