తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు.
