గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త భవనాలు అభివృద్ధి కాదంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అంటే గవర్నర్ తమిళ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని అనుకోవాలా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను, పాలనను మెరుగుపరిచేందుకు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ భవనాన్ని, జిల్లాల్లో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాలను, సాగునీటి కష్టాలు తీర్చేందుకు నిర్మించిన భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును, ప్రపంచం నివ్వెరా పోయేలా నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని గవర్నర్ వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని గవర్నర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు.
జాతి నిర్మాణం అంటే ఏంటో గవర్నర్ కాస్త వివరంగా చెప్పగలరా అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలు చేస్తున్న అభివృద్ధి అంతా జాతి నిర్మాణంలో భాగం కాదా? తెలంగాణ భారత దేశంలో లేదా? కేవలం రాజ్ భవన్ మాత్రమే జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటోందా? అని సతీష్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాలకు రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ దిశగా గవర్నర్ ఇకనైనా పనిచేయాలని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 సందర్భంగా అయినా తీరు మార్చుకోవాలని ఆయన కోరారు. బిజెపి చేతిలో పావుగా ఉండడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని గవర్నర్ తమిళిసై గారిని రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి కోరారు.