MINISTER NIRANJANREDDI: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి దీటుగా బదులిచ్చారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం జాప్యానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పీఎస్ లలో కేసులు వేసి అడ్డంకులు సృష్టించకపోయింటే ఈ పాటికే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయని మండిపడ్డారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వలేకపోయిందని మంత్రి గుర్తు చేశారు. తెరాస అధికారంలోకి వచ్చాక 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోతే మరో రెండేళ్లలో దాదాపు 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. గతంలో 30వేల రూపాయలకు పలికిన ఎకరా భూమి….. ఇవాళ సుమారు 20 లక్షల రూపాయలకుపైగా పలుకుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 13 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
సరైన సమయంలో కాంగ్రెస్ పోరాడకుండా ఉండటం వల్లే కేంద్ర భాజపా ఆగడాలకు అంతులేకుండా పోయందన్నారు. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లని రాహుల్ గాంధీ….భాజపాను ఎలా ఓడిస్తారని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.