CHINTAKAYALA VIJAY: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈనెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
భారతి పే పేరిట సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్ పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుని నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లగా విజయ్ అందుబాటులో లేరు. అందువల్ల విజయ్ తల్లికి అధికారులు నోటీసులు అందించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాదులోని విజయ్ నివాసంలో ఇప్పటికే నోటీసులు అందించడం జరిగిందని……..విచారణకు రాకపోవడంతో మరోసారి 41ఏ నోటీసులు ఇచ్చామని సీఐడీ పోలీసులు తెలిపారు.