Amaravati: విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి…..అధికారులతో సమీక్ష నిర్వహించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. మంత్రులు మేరుగు నాగార్జున, బొత్స, సీఎస్, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహం ఎత్తు పీఠంతో కలుపుకుని 206 అడుగుల మేర ఉంటుంది. స్మృతివనం ప్రాజెక్టు వ్యయం 268 కోట్ల రూపాయలని సీఎంకు అధికారులు వెల్లడించారు. పీఠం భాగంలో g+2 నిర్మాణం చేపడతామని అన్నారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహ నిర్మాణంలో 352 మె.ట. ఉక్కు, 112 మె.ట. ఇత్తడిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈనెల చివరి నాటికి కాస్టింగ్ చేసిన భాగాల తరలింపునకు ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి నెలాఖరికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. పార్కింగ్ కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామన్నారు. ప్రాజెక్టును త్వరితగతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అత్యంత నాణ్యత, నిర్మాణాలు అందంగా ఉండాలన్నారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.