తెలంగాణలో నిన్న జరిగిన ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు. తొలుత కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ వారితో కలిసి అల్పాహారం చేసి, పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పినరాయి విజయన్, డీ రాజా ప్రెసిడెన్షియల్ సూట్‌లో బస చేయగా.. మిగతావారంతా ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అద్దాల మండపం వద్ద అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. ఆ తర్వాత వారు మాడ వీధుల్లో కలియతిరిగారు.
ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, స్థల పురాణం, ఆలయ ప్రాశస్త్యం, ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణం తీరును సీఎం కేసీఆర్ స్వయంగా వారికి వివరించారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని కేజ్రీవాల్, భగవంత్‌సింగ్‌మాన్, అఖిలేశ్ యాదవ్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడారు. వీరి వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.