Minister Harish rao: రాష్ట్రంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మంత్రులు తలసాని శ్రీనివాస్, హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.
రెెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఈసారి మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కంటి పరీక్షలు చేయనున్నారు. పూర్వ అనుభవాల దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటి పరీక్షలు, కళ్లద్దాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1500 బృందాలు సేవలు అందిస్తున్నాయని చెప్పారు.
వరంగల్ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. వృద్ధులు, మహిళలు పెద్దసంఖ్యలో శిబిరాల వద్దకు చేరుకుని పరీక్షలు చేయించుకుంటున్నారు.
కరీంనగర్ ఇందిరానగర్ లో మంత్రి గంగుల కమలాకర్.. కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. శిబిరానికి వచ్చిన పలువురికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల శిబిరాన్ని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పలువురి అద్దాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.