Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రధాన రహదారి వైపు దారి మళ్లించారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
భవనం మూడు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న దుస్తుల దుకాణంలో మంటలు అంటుకుని అగ్నికీలలు ఎగిసి పడ్డాయి. భారీ క్రేన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది భవనం అద్దాలు పగలగొట్టి లోపల అలముకున్న పొగను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. భవనం లోపల ఐదుగురు చిక్కుకున్నారు. ఇప్పటికే ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరిని రక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు.
మంటలు అదుపు చేస్తున్నా.. దట్టమైన పొగ వల్ల మంటలు ఆర్పేందుకు రక్షణ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. లోపల బట్టల నిల్వలు ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా యూనిట్ ఇక్కడ పెట్టడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అనుమతులు లేకుండా జనావాసాల్లో నడుస్తున్న తయారీ యూనిట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్… అగ్నిప్రమాద స్థలికి చేరుకుని సహాయ చర్యలు పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చారు. ఇళ్ల మధ్య గోదాములు, పరిశ్రమలు ఉండటం దురదృష్టకరమని మంత్రి తలసాని విచారం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారన్న మంత్రి….తక్షణమే తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడితే 25 వేల దుకాణాలు ఖాళీ చేయించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పరిశ్రమలు, గోదాములపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.