Ysrcp : రానున్న ఎన్నికలలో కూడా అధికారమే లక్ష్యంగా వైసీపీ నేతలంతా కలిసి పనిచేయాలని, విబేధాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి అందరూ ఒక్కటి కావాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశామయ్యారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. ఈ మీటింగ్ లో పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… నియోజకవర్గాల వారీగా మన పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. కార్యకర్తలను కలుసుకోవడం దీని వెనుకున్న ఉద్దేశం. అంతేకాకుండా మరో 14, 15 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రతీ నియోజకవర్గంలోని గడపగడపకూ వెళ్లడం ద్వారా మనం ప్రజల్లో మమేకం అవుతున్నాం. ఎక్కడైనా ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే వారికి కూడా మంచి జరగాలి. దేవుడి దయతో మంచి పనులన్నీ చేయగలిగామని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ వివరించాలి.
వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమింపచేస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తాం. గృహసారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. ప్రజలతో పార్టీ క్యాడర్ మమేకం కావాలి అని అన్నారు. అలాగే కుప్పం లాంటి చోట్ల మున్సిపాల్టీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్నీ 80 శాతానికి పైగా క్లీన్ స్వీప్ చేయగలిగాం అని పేర్కొన్నారు.