తెలంగాణలో బీఆర్‌ఎస్ చేసిన శంఖారావం.. దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్‌ఎస్ సంచలనంగా మారుతున్నది. పార్టీని ఏపీ అంతటా విస్తరించాలని వివిధ వర్గాలు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి సోమవారం హైదరాబాద్‌లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
దేశ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) హవా మొదలైంది. అనేక రాష్ర్టాల రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్‌ఎస్సే ప్రధాన చర్చనీయాంశమవుతున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాల్లో మేధావి వర్గం, యువత, రైతాంగం బీఆర్‌ఎస్‌పట్ల అమితాసక్తి చూపుతున్నది. సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్థాయిలో కూడా బీఆర్‌ఎస్ ఒక సంచలనంగా మారుతున్నది. విద్యార్థులు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల కొందరు నేతలు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావును కలిసి తమ రాష్ట్రంలో పార్టీని విస్తరించాలని కోరారు. తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి సోమవారం తెలంగాణ భవన్‌లో కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వీరితోపాటుగా ఏపీలోని వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో వారి అనుచరులు కూడా బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. వీరి చేరికతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని, బీఆర్‌ఎస్ కీలక శక్తిగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, అనేకమంది బీఆర్‌ఎస్ జాతీయ నాయకత్వాన్ని సంప్రదిస్తున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏపీకి చెందిన విద్యార్థి, యువత, వివిధ రైతు సంఘాల నాయకులు బీఆర్‌ఎస్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడానికి ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీఆర్‌ఎస్ కీలక శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అనేకమంది బీఆర్‌ఎస్‌లో చేరారు.
నేతల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: విద్యార్థి జేఏసీ
———————————————
దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీకి చెందిన ముఖ్యనాయకులు తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి కిశోర్ బాబు, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారధి సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ యూత్ అండ్ స్టూడెంట్స్ జేఏసీ తెలిపింది. వీరి నిర్ణయంతో ఏపీ రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు పడుతాయని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరి చేరిక నిర్ణయం కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలుచేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎదిరించి, సకల సమస్యల నుంచి దేశాన్ని గట్టెక్కించే ఏకైక నేత కేసీఆర్ అని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో దండుగా కదలడం ఖాయమని పేర్కొన్నారు. ఏపీలోనూ బీఆర్‌ఎస్ జెండా వాడవాడన రెపరెపలాడి తీరుతుందని అన్నారు. గత తొమ్మిదేండ్లలో చంద్రబాబు, వైఎస్ జగన్ ఆధ్వాన్నపాలనతో ఏపీలో అన్ని రంగాలు వెనకబడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతతోపాటు రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలు అన్యాయానికి గురయ్యాయని తెలిపారు. సకల జనుల సంక్షేమం దిశగా పాలనా వ్యవస్థను తీర్చిదిద్దిన కేసీఆర్ వల్లే ఏపీ సమస్యలు పరిష్కారమవుతాయని తేల్చిచెప్పారు.
తోట చంద్రశేఖర్
——————————
బీఆర్‌ఎస్‌లో చేరనున్న తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2.27లక్షల ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5.21లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు.
రావెల కిశోర్ బాబు
—————————–
ఐఆర్‌టీఎస్ విశ్రాంత అధికారి ఆయన కిషోర్‌బాబు, 2014 నుంచి 2018 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగారు.
పార్థసారధి
——————–
ఐఆర్‌ఎస్ అధికారి అయిన పార్థ్ధసారధి 2019లో అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. 82 వేల ఓట్లను సాధించారు.
తోట చంద్రశేఖర్‌కు శుభాకాంక్షలు
—————————————
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌కు ఏపీ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి పలు నియోజవర్గాల నాయకులు రాధాకృష్ణ (కన్నబాబు), బంగార్రాజు, ఎస్ రాజేశ్‌కుమార్ (పీ గన్నవరం), శ్రీనివాసరావు (కొత్తపేట), జేవీ రావు (రామచంద్రపురం), జి శ్రీనివాస్, రమేశ్, మురళీకృష్ణ తదితరులున్నారు.