మంద శ్రీనివాస్‌ది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామం. ఆయనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనతోపాటు ఆయన భార్య కూడా వ్యవసాయ పనులు చేస్తారు. పంట పెట్టుబడి కోసం గతంలో శ్రీనివాస్ అనేక ఇబ్బందులు పడేవారు. భార్యతో కలిసి కూలి పనులకు వెళ్లి కొంత డబ్బు పోగు చేసేవారు. తీరా అది చాలక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాడు.
రెండు, మూడు రూపాయల వడ్డీతో అప్పులు చేసేవారు. అప్పు సమయానికి దొరకక టెన్షన్ పడేవారు. పంట పండిన తర్వాత ఉత్పత్తులను అమ్మి వడ్డీ సహా అప్పు తీర్చేవారు. పొద్దస్తమానం కష్టపడ్డా చివరకు అప్పులు, వడ్డీలు పోను ఏమీ మిగిలేది కాదు. దీంతో ఒక దశలో తనకు వ్యవసాయంపైనే విరక్తి కలిగిందని చెప్తుంటారు శ్రీనివాస్. అయితే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చిన తరువాత తన పరిస్థితి చాలా మెరుగైందని చెప్తున్నాడు. ఆయనలో ధీమా పెరిగింది. పెట్టుబడికి అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పింది.
పంట పెట్టుబడికి భరోసా దొరికింది. కూలి పనులకు వెళ్తేనే పంట పెట్టుబడి అవసరాలు తీరుతాయనే బాధ తప్పింది. ఆయనకు ఉన్న రెండెకరాలకు రైతుబంధు కింద ఏటా రెండు విడతల్లో రూ.20 వేలు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నది. దీంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నానని సంతోషంగా చెప్తున్నారు.
తాజాగా గురువారం శ్రీనివాస్ ఖాతాలో రైతుబంధు సాయం రూ.10 వేలు జమైంది. రైతుబంధు రూపంలో శ్రీనివాస్‌కు పంట పెట్టుబడి సాయం అందడం ఇది పదోసారి. రైతుబంధు వచ్చిన తర్వాత ఇప్పటివరకు పంట పెట్టుబడి కోసం శ్రీనివాస్ అప్పు చేయలేదు. రైతుబంధు సొమ్ములు తన బ్యాంకు ఖాతాలో జమ కాగానే ఆ డబ్బుతో ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నానని, ఇతర పెట్టుబడులకు వినియోగిస్తున్నామని శ్రీనివాస్ చెప్తున్నారు. పండిన పంటను మార్కెట్‌లో అమ్మి ఆదాయం పొందుతున్నామని, కుటుంబ అవసరాలు తీరుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు