వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.12 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) ప్రణాళిక రూపొందించింది. ఇందులో పంట రుణాలుగా రూ. 73,437 కోట్లు, అనుబంధ రంగాలకు టర్మ్‌లోన్ కింద రూ.39,326 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక మొత్తంగా అన్ని రంగాలకు కలిపి రూ.1.85 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించింది.
ఈ ప్రణాళికను గురువారం నగరంలోని ఓ హోటల్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ విడుదల చేశారు. గత ఏడాది నాబార్డ్ వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.01 లక్షల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఏడాది దానిని రూ.1.12 లక్షల కోట్లకు పెంచింది. గత ఏడాదితో పోల్చితే వ్యవసాయానికి రూ. 19,070 కోట్లు అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించండి
———————————————
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో రైతులకు ఆయిల్‌పాం సాగు కోసం రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు నాబార్డ్‌ను కోరారు. నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాంను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సాగు చేస్తున్నదని, ఇందుకు సంబంధించి రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని చెప్పారు.
రాష్ట్రంలో వరిసాగు భారీగా పెరుగుతున్నదని, అదే సమయంలో కూలీల సమస్య వేధిస్తున్నదని దీంతో రైతుకు పెట్టుబడి భారం అధికమవుతున్నదని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వరిసాగులో నాట్లు వేసేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలను అందించాలని కోరారు. దీంతోపాటు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డ్‌ను కోరారు. ఇది పారిశ్రామికవేత్తలతోపాటు రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ‘ఇప్పటికే అనేక పథకాలకు రుణ సహాయం చేసిన నాబార్డ్ ముందు సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి తొందరగా అనుమతి ఇవ్వాలని నాబార్డ్ సీజీఎం సుశీల చింతలను కోరుతున్నాను.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సంగారెడ్డి జిల్లా ప్రాంతంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుంది’ అని చెప్పారు. నాబార్డ్ సహకారంతో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. కాళేశ్వరం, చెక్ డ్యాంల నిర్మాణం, మైక్రో ఇరిగేషన్, గోదాముల నిర్మాణం ఇలా పలు కార్యక్రమాలకు నాబార్డ్ రుణాలు అందించి సహకరించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్వయసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, నాబార్డ్ సీజీఎం సుశీల చింతల, నాబార్డ్ జీఎం సెల్వన్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.