వ్యర్థజలాల శుద్ధి సంస్థ దైకి యాక్సిస్ జపాన్.. తెలంగాణలో ఓ ప్లాంట్‌ను పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని వ్యాపీలో ఓ యూనిట్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ.. గత నెల్లోనే హర్యానాలోని పల్వాల్‌లో రెండో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలపై సంస్థ దృష్టిసారించింది.
తమ తదుపరి ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలను పరిశీలిస్తున్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఇం దుకు సంబంధించి సమావేశాలు కూడా జరిగాయని తాజాగా దైకి యాక్సిస్ ఇండియా సీఈవో కమల్ తివారీ తెలిపారు. అనుమతులు వస్తే వచ్చే ఏడాది ప్లాంట్ నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. రూ.200 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ రానున్నది.
రాష్ర్టానికో ప్లాంట్ దిశగా..
————————–
దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేలా సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు దైకి యాక్సిస్ ఇండియా సీఈవో తివారీ చెప్పారు. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ర్టాల్లో తమ మూడో ప్లాంట్‌కు సంస్థ శ్రీకారం చుడుతున్నది. కాగా, వ్యాపీ, పల్వాల్ ప్లాంట్లలో వార్షిక సామర్థ్యం సగటున దాదాపు 1,000 సేవేజ్ వాటర్ ట్రీట్‌మెంట్ యూనిట్ల చొప్పున ఉన్నది. జపాన్‌కు చెందిన ‘జోకాసౌ’ టెక్నాలజీతో స్థానిక మురుగునీటి జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించేలా కంపెనీ చేస్తున్నది. కొత్తగా వచ్చే అన్ని ప్లాంట్ల సామర్థ్యం ఒకేలా ఉంటుందని, పెట్టుబడులు కూడా అంతే శ్రేణిలో ఉంటాయని తివారీ తెలిపారు.
ప్రయోజనాలు అనేకం
————————
వ్యర్థజలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వల్ల నీటి లభ్యత పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో 60 కోట్ల మంది నీటి కొరతను ఎదుర్కొంటున్నదని గుర్తుచేస్తున్నారు. ప్రతి నాలు గిండ్లలో మూడింటికి త్రాగునీరు సమీపంలో లేదని చెప్తున్నారు. జల వనరుల్లో 70 శాతం కలుషితంగానే మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నీటి నాణ్యత సూచీలో భారత్ ప్రపంచంలో అట్టడుగునే ఉన్నది. 122 దేశాల్లో 120వ స్థానంలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.