కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో దేశం అన్నింటా వెనుకబడి పోతున్నదని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, నిధులన్నీ కేంద్రానికి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెస్‌లు, సర్‌చార్టీల పేరుతో రాష్ర్టాల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మంగళవారం కేటాయింపుల బిల్లుపై కేశవరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాల ఆదాయం రెట్టింపు చేస్తామని, నిరుద్యోగాన్ని కాలరాస్తామని చెప్పారని, కానీ.. ప్రస్తుతం దేశంలో ఆదాయం సంగతి పక్కన పెడితే.. ధరలన్నీ రెట్టింపు చేశారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ రేటును మరింత పెంచేశారని చెప్పారు. కేంద్రం రాష్ర్టాలను ఆర్థికంగా తొక్కేస్తున్నా, తెలంగాణ మాత్రం ఆర్థికంగా రోజురోజుకూ బలపడుతున్నదని తెలిపారు.
ఆర్‌బీఐ లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. దేశ జనాభాలో తెలంగాణ కేవలం రెండు శాతం మాత్రమేనని, అయినప్పటికీ.. దేశ జీడీపీలో ఐదో అతిపెద్ద వాటాను కలిగి ఉన్నదని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారపార్టీ ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టిందని, హామీలన్నీ మరిచిందని విమర్శించారు.
ఈడీని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అందులో.. సుమారు 95 శాతం కేసులు తప్పుడువేనని తేలుతున్నదని, అటువంటి ఈడీకి అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని కేశవరావు అభిప్రాయపడ్డారు. 15 వస్తువులపై ఉండే సెస్, సర్‌చార్జీలను బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24కు పెంచిందన్నారు. తద్వారా కేంద్రానికి సుమారు లక్షకోట్ల రూపాయలు అదనంగా సమకూరుతున్నాయని తెలిపారు. ఇదంతా.. రాష్ర్టాలకు రావాల్సిన వాటా అని చెప్పారు.