తెలంగాణలోని గర్భిణిల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం త్వరలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించనున్నట్లు ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. గర్భిణిలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చునన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన దవాఖానను ప్రారంభించారు.
ములుగులో హంస హోమియో మెడికల్ కాలేజీలో 75 పడకల బోధన దవాఖానను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నదని హరీష్‌రావు చెప్పారు. ఆయుష్‌కు మంచి భవిష్యత్ ఉన్నదని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సాంప్రదాయ వైద్యానికి రోజు రోజుకు ప్రాధాన్యం పెరుగుతున్నదన్నారు. ఆయుర్వేదం, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి.. దేనికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో కేసీఆర్ ఆలోచనల మేరకు బస్తీ పల్లె దవాఖానాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పల్లె దవాఖానల్లో ఆయుష్ డాక్టర్లను కూడా రిక్రూట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని కేంద్ర ఆయుష్ సెక్రెటరీ రాజేష్‌కు కొటేషన్ కూడా పంపినామని చెప్పారు.
నేచర్ క్యూర్ దవాఖాన కోసం రూ.6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేటలో మాదిరిగానే వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో కూడా 50 పడకలతో కూడిన ఆయుష్ దవాఖానలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని, వీటిలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌కు చికిత్స మాదిరిగా అనవసరపు సీ సెక్షన్లు పెరిగాయని, తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతేనే తప్ప సీ సెక్షన్ చేయవద్దని డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నామని హరీష్‌రావు చెప్పారు