కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ సోమవారం తెలిపారు.
దీని నివారణ కోసం ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని, మార్గదర్శకాలను కూడా జారీ చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.‘జికా వైరస్ నిర్ధారణ అయినట్టు పూణే ల్యాబ్ నుంచి మాకు నివేదిక వచ్చింది. డిసెంబర్ 5వ తేదీన ఇది ప్రాసెస్ అయ్యి, డిసెంబర్ 8న నివేదించబడింది. మూడు నమూనాలను పంపగా అందులో రెండు నెగిటివ్, ఒకటి పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ గా తేలిన బాలికకు ఐదు సంవత్సరాల వయస్సు ఉంటుంది. మేము అప్రమత్తంగా ఉన్నాము’’ అని రాయచూర్ లో జికా వైరస్ కేసుపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సుధాకర్ సమాధానం చెప్పారు.కొన్ని నెలల క్రితం కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లలో జికా వైరస్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
‘కర్ణాటకలో నమోదైన తొలి కేసు ఇది. సీరంను డెంగ్యూ, చికున్ గున్యా కోసం పరీక్షించినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. సాధారణంగా 10 శాతం శాంపిల్స్ ను పరీక్షల కోసం పూణెకు పంపిస్తారు. అందులో ఒకటి పాజిటివ్ గా తేలింది. ’’ అని మంత్రి అన్నారు. రాయచూర్, చుట్టుపక్కల జిల్లాల్లోని నిఘా (ఆరోగ్య శాఖ) అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చామని, ఆసుపత్రిలో ఏదైనా అనుమానిత ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తే నమూనాలను జికా వైరస్ పరీక్ష కోసం పంపాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జికా వైరస్ ఇతర కొత్త కేసులు కనుగొనబడలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని మంత్రి తెలిపారు.కాగా.. జికా వైరస్ ఈడెస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది, ఇది డెంగ్యూ , చికున్ గున్యా వంటి అంటువ్యాధులను కూడా వ్యాప్తి చేస్తుంది. 1947లో ఉగాండాలో మొదటి సారిగా ఈ వైరస్ ను గుర్తించారు.