సినీ ఇండస్ట్రీలో కేవలం నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ నాయికగా తనకో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ ఏడాది ‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నాయిక..ఇప్పుడు బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీలో సాయి పల్లవి సీతగా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో ఈ క్యారెక్టర్ కోసం దీపికాను సంప్రదించారు. అయితే తాజాగా సాయి పల్లవినే ఖరారు చేసినట్లు తెలుస్తున్నది.ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా…మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ రావణుడి పాత్రను పోషిస్తున్నారట. ఈ చిత్రాన్ని దర్శకులు నితేష్ తివారి, రవి ఉద్యావర్ రూపొందించబోతున్నారు.
మధు మంతెన నిర్మాణ బాధ్యతలు వహిస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా..వచ్చే ఏడాది సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. సాయి పల్లవి కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రామాయణ కథతో ప్రభాస్, కృతి సనన్ జంటగా ‘ఆది పురుష్’ సినిమా రూపొందుతున్నది.