ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ పతనానికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాంది పలికాయన్నారు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో దేశం మూడ్ ను ప్రతిబింభించాయన్నారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపాలిటీ బీజేపీ చేతుల్లోనే ఉందని.. ఈ సారి కూడా గెలవాలని బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. ఏప్రిల్ లో జరగాల్సిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను కేంద్రంలోని మోడీ సర్కారు కావాలనే డిసెంబర్ వరకు ఆపుతూ వచ్చిందన్నారు.
దురుద్దేశపూర్వకంగానే గుజరాత్ ఎన్నికల సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగేలా ఆలస్యం చేశారని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు అక్కడ ఫోకస్ పెడితే.. బీజేపీ మాత్రం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిందన్నారు. తమ పార్టీ సీఎంలు, కేంద్రమంత్రులను తీసుకొచ్చి ఢిల్లీలో ప్రచారం చేసిందన్నారు. అయినా బీజేపీకి ఎదురుదెబ్బ తప్పలేదని ఎద్దేవా చేశారు. ఫేక్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన మోడీని, మోడీ మోడల్ లోగుట్టును ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు.
ఢిల్లీ ఫలితంతో.. మోడీ మోడల్ కు, బీజేపీకి కాలం చెల్లిందనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచేసి.. ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాజ్యాంగవ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తూ, గవర్నర్లతో రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలను నిశితంగా గమనిస్తున్నారని… వాటి పర్యావసనమే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలని సతీష్ రెడ్డి వివరించారు. ఓ హిట్లర్ మాదిరిగా దేశంలో నియంతృత్వ పాలన చేస్తున్న మోడీకి, బీజేపీకి చరమగీతం పాడాలని ఢిల్లీతో పాటు.. దేశప్రజలంతా నిర్ణయించుకున్నారని అన్నారు. అతి త్వరలోనే బీజేపీ నుంచి దేశానికి విముక్తి కలగబోతోందని జోస్యం చెప్పారు.