గతంలో టీడీపీ సర్కార్ యువతను నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు హయాంలో నిరుద్యోగులు చాలా మందే ఉన్నారని ఏపీ మంత్రి విడదల రజని విమర్శించారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం జగన్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. ప్రతి ఇంట్లో వైసీపీ పథకాలు ఉన్నాయని, లేదని చూపే ధైర్యం టీడీపీ నాయకులకు లేదన్నారు. ఎందుకంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ సర్కార్ అండగా నిలబడుతోందని, సమస్య పరిష్కారానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తోందన్నారు.
టీడీపీ నేత చంద్రబాబు హయాంలో ఒక్క ఆసుపత్రికి కూడా నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆయన ప్రభుత్వంలో నియామకాలు కూడా చేపట్టకపోవడం సిగ్గు చేటన్నారు. సీఎం జగన్ పాలనలో వైద్య, ఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 4 లక్షలకు మందికి పైగా ఉద్యోగాలను కల్పించి, ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అమరరాజా సంస్థ వ్యాపార విస్తరణ కోసం తెలంగాణకు వెళ్తే దాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను ఎవ్వరూ పట్టించుకోరని విమర్శించారు. విశాఖకు భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు ఏపీకి వస్తున్న సంగతి తెలుసుకుని ఆ తర్వాత టీడీపీ నేతలు మాట్లాడాలని సూచించారు. అదానీ, ఇన్ఫోసిస్ వంటి బడా సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెడుతుండటం చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు కనపడటం లేదా అని విడదల రజని ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ పాలనను ప్రశ్నించే అర్హత నారా చంద్రబాబు నాయుడుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.