Perni Nani : పవన్ కళ్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఈ మేరకు తాజాగా మీడియాతో సమావేశం నిర్వహించిన పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని నాని ఎద్దేవ చేశారు. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్ అని… పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని విమర్శించారు. ఎవరో సినిమా రైటర్ రాసిచ్చిన స్క్రిప్ట్ పవన్ చదివారని అన్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను నోటీసులు ఇచ్చి తొలగించారని… ఇప్పటంలో ఏమీ కూలలేదని అక్కడి వాళ్లే చెబుతున్నారన్నారు.
ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు నాని. చంద్రబాబు దౌర్జన్యంగా పొలాల్లో రోడ్లు వేసినప్పుడు, పొలాలు తగులబెట్టినప్పుడు మీ గుండెల్లో గుండు సూది కూడా గుచ్చుకోలేదా ? అని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్ని గుడులు, మసీదులు కూలగొట్టారు ? అప్పుడు మీ తోలు మందమైందా పవన్ ? అంటూ నిలదీశారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎవరైనా రోడ్ మ్యాప్ ఇవ్వాలని అడుక్కుంటారా ? అని అభిప్రాయపడ్డారు. పవన్ మాటలు, వీడియోలు మ్యూజియంలో పెట్టాలన్నారు.
2014 లో వైకాపాకు 67 సీట్లు, 2019 లో 151 సీట్లు వచ్చినప్పుడు నోట్లో వేలు పెట్టుకొని చూశావ్ కదా ? రేపు 175 సీట్లు వచ్చినప్పుడు కూడా అలాగే చూడంటూ సెటైర్ వేశారు. పవన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని నాని మండిపడ్డారు. పవన్ విధానాలు చూసే ప్రజలు ఓటేయలేదన్నారు. 2024లో కూడా ప్రజలు పవన్ కు ఓటు వేయరని తేల్చిచెప్పారు.