CM YS JAGAN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్ర లోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతో పాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.
మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్సీ, ఏస్ ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మోకానిక్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేయనున్నారు. కావున ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరిల వారీగా 5 శాతం నుంచి 25 శాతం వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్ 1999కి సవరణ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో 15,000 మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందని తెలుస్తుంది. ఈ తరుణంలోనే అయితే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.