CM KCR : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్లో నిర్వహించాలని సీఎం కేసిఆర్ నిర్ణయంచారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని నిర్ణయించారు.
తెలంగాణపై మోదీ ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్ల తెలంగాణ రూ.40 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈడీ, ఐటీ దాడులను సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ చెప్పారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు ప్రోరోగ్ కాకపోవడంతో ఆ సమావేశాలకు కొనసాగింపు గానే డిసెంబరు సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇక్కడి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ అంశంపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు.