Political Fight : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య రోజుకో రచ్చ జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య బూతు పురాణం కొనసాగుతోంది. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవ్వరు కూడా తక్కేవేం కాదన్నట్లు కొనసాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. గతంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ను అసభ్యంగా మాట్లాడి పెద్ద రచ్చకు తెరలేపారు. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తూ పార్టీ తరుపున క్షమాపణ చెప్పాలి.
కానీ చంద్రబాబు అది చేయకపోగా వైసీపీ నేతలు తమను ఎన్ని మాటలు అన్నారని ఎదురు ప్రశ్నించడంతో పార్టీ నేతలు కూడా షాక్ అయ్యారు. నోళ్లు మరింతగా తెరుచుకున్నట్లయింది. సభ్యసమాజం తలదించుకునే విధంగా ఒక ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తనను తాను ప్రశ్నించుకోలేకపోయారు చంద్రబాబు.
అయితే ఇప్పుడు సీఎం జగన్ , చంద్రబాబు నాయుడు మధ్య వ్యక్తిగత వైరం తారా స్థాయికి చేరింది. ఒకరి ముందు ఇంకొకరి పేరు తీస్తేనే ఆగ్రహంతో రగిలిపోయే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇరు నేతలను ఒకే వేదిక పైకి రాబోతుండడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వచ్చే నెల 5న ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి హాజరు కావాలని ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకోనున్నారు.