Kodali Nani : రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ… ఇప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్షపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. రాష్ట్రం లోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. వైకాపా నేత కొడాలి నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. జగన్ కి అత్యంత ఆప్తుల్లో కొడాలి నాని కూడా ఒకరు. అయితే ఇప్పుడు కొడాలి నాని దూకుడు చెక్ పెట్టేందుకు టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోందని సమాచారం.
గుడివాడలో కొడాలిని ఢీ కొట్టేందుకు తెదేపా వ్యూహాలు రచిస్తుంది. కొడాలి నానిపై పోటీకి ఎన్నారైను రంగంలోకి దించే ప్లాన్ చేస్తోందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నారై వెనిగళ్ల రామును టిడిపి తరపున బరిలోకి దింపేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించిందని టాక్ నడుస్తుంది. ఆయనకు చంద్రబాబు కూడా ఓకే చెప్పారని… దీంతో కొన్నాళ్లుగా నియోజకవర్గంలో రాము కుటుంబ సభ్యులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే టీడీపీ యాక్షన్ పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గుడివాడలో గెలుపోటములను నిర్ణయించేది ఇక్కడి ప్రజలే అని నాని చెప్పారు.
గుడివాడలో చంద్రబాబు, లోకేశ్, ఎన్నారై… ఎవరు పోటీ చేసినా బరిలోకి దిగేది నేనే అని అన్నారు. ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని… వందల కోట్లు డబ్బు తెస్తే గుడివాడ ప్రజలు అమ్ముడుపోరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా సరే… చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడతానని కొడాలి నాని స్పష్టం చేశారు. గతంలో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతుందని తేల్చి చెప్పారు.