సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం ట్విటర్ నూతన యజమాని ఎలన్ మస్క్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి షాక్ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ట్రంప్ ట్విటర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించగా, మళ్లీ ఆ వేదికపైకి వెళ్ళాలనే ఆసక్తి తనకు లేదని ట్రంప్ చెప్పారు. తాను తన సొంత వేదిక ట్రూత్ సోషల్‌లోనే ఉంటానని చెప్పారు.
2021 జనవరి 6న అమెరికా కేపిటల్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో జరిగిన ఈ హింసాకాండ నేపథ్యంలో ఆయన ట్విటర్ ఖాతాపై ఆ కంపెనీ నిషేధం విధించింది. దీంతో ఆయన సొంతంగా ట్రూత్ సోషల్ అనే సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ను రూపొందించుకుని, ఉపయోగిస్తున్నారు.