తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
కాగా, కొత్తగా మంజూరైన ఉద్యోగాల్లో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు.మల్కాజిగిరి, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, షాద్‌నగర్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురి, పినపాక నియోజకవర్గాల్లో కొత్తగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.