ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్.. మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్ మస్క్ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 నుంచి 5,500 మంది ఔట్‌సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు తెలుస్తోంది.
అయితే వారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. తాజా కోతలపై ట్విట్టర్ నుంచి గానీ, కొత్త బాస్ మస్క్ నుంచి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.