కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.
‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. రూ.10,742కోట్లు వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభిస్తున్నారు. మోదీకి రాష్ట్ర ప్రజలు, అశేష జనం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైద్యం, విద్య, సంక్షేమం, మహిళాభివృద్ధి, పారదర్శకమైన గడప వద్దకే పాలనే ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం.
ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకు మా ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయీ ఖర్చు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో అజెండా లేదు.. ఉండదు.. ఉండబోదు. విభజన హామీలైన పోలవరం, ప్రత్యేకహోదా, రైల్వేజోన్ తదితర హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరేవేర్చాలని కోరుతున్నా’’ అని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.