కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్-కొంపల్లి మున్సిపాలిటీలలో సుమారు రూ.205 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి, ఎస్.ఎన్.డి.పి, అర్బన్ ఫారెస్ట్, టీఎస్పిడిసీఎల్, కన్స్ట్రక్షన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బాచుపల్లి ఫ్లై ఓవర్, మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్-ఎంట్రీ, కొంపల్లి నుండి దూలపల్లి మీదుగా బహదూర్ పల్లి రోడ్డు అభివృద్ధి, గండిమైస్మమ్మ నుండి బాచుపల్లి రోడ్డు అభివృద్ధి మరియు వెడల్పు పనులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చేపడుతున్న బాచుపల్లి ఫ్లై ఓవర్, మల్లంపేట్ ఎగ్జిట్-ఎంట్రీ, రోడ్డు వెడల్పు పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి వహించి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆయా రోడ్ల అభివృద్ధికి అడ్డుగా ఉన్న కరెంటు స్థంబాలు, మంచినీటి పైపు లైన్లు బదిలీ చేసేందుకు చర్యలను ముమ్మరం చేయాలన్నారు.
పనుల్లో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగి, పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, HMDA ఎస్ఈ యూసఫ్ హుస్సేన్, కమిషనర్లు వంశీకృష్ణ, భోగీశ్వర్లు, రఘు, మాదాపూర్ ఏసీపీ హనుమంత రావు, బాలానగర్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, మేడ్చల్ డిఎఫ్ఓ జానకీ రామ్, దూలపల్లి ఎఫ్ఆర్ఓ లక్ష్మణ్, మియాపూర్ ఏడిఈ హరికృష్ణ, SNDP డిఈఈ నళిని, సీఐలు నర్సింహా రెడ్డి, రాజు, నాగేష్, చంద్రశేఖర్ రెడ్డి మరియు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.