టీనేజ్ వయసు రాగానే మగవారిలో, ఆడవారిలో మొటిమలు కనిపిస్తుంటాయి. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. అయితే మధ్య వయసు వారిలో మొటిమలు రావడం అసహజంగా ఉంటుంది. మన వద్ద 40 ఏండ్లు దాటిన వారిలో మొటిమలు కనిపిస్తున్నాయి. ఇలా మధ్య వయసులో మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఎలా తయారవుతాయి..
చమురు గ్రంథులను నిరోధించినప్పుడు చర్మం ఉపరితలంపై డెడ్ స్కిన్ కణాలు, బ్యాక్టీరియా, మురికి వంటివాటితో పాటు సెబమ్ అనే మైనం పదార్థం పేరుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. ఇవన్నీ కలిసి చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి.
ఈ మొటిమలు సాధారణంగా 40 ఏండ్లు దాటిన వారిలో కనిపిస్తుంటాయి. ఇవి చూడ్డానికి టీనేజ్ మొటిమల మాదిరిగానే కనిపిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా డైట్, లైఫ్‌స్టైల్, స్కిన్ కేర్ వంటి అంశాలపై ఆధారపడి తయారవుతుంటాయి. అయితే, ఇవన్నీ పాటించినప్పటికీ కొంతమందికి యుక్తవయసులో మొటిమలు వస్తుంటాయి.
ఇవీ అనియంత్రిత కారకాలు..
- చర్మం అదనపు నూనె, బ్యాక్టీరియాను కలిగి ఉండటం
- హార్మోన్ల విడుదలలో మార్పులకు లోనవడం
- రుతుస్రావ చక్రంలో మార్పులు కనిపించడం
- గర్భం ధరించిన సందర్భాలు
- సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉండటం
- వీటితో పాటు వంశపారంపర్యంగా కూడా అడల్ట్ యాక్నే వస్తుంటాయి.
ఇవీ నియంత్రిత కారకాలు..
- మేకప్ ఉపయోగించడం – ముఖానికి వేసుకునే మేకప్ సరిగ్గా ఉపయోగించకపోతే, అలాగే సరైన రీతిలో తుడిచివేయకపోతే రంధ్రాలు మూసుకుపోతాయి. మేకప్‌ను తప్పుగా లేదా అధికంగా ఉపయోగించే అలవాటు అడల్ట్ యాక్నేకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
- ఒత్తిడి – శారీరకంగా, మానసికంగా ఆందోళనకు గురవడం, తీవ్ర ఒత్తిడి అనుభవించే వారిలో ఈ మొటిమలు కనిపిస్తాయి.
- చక్కెర ఆహారాలు, ఆయిలీ ఫుడ్స్ – మొటిమలు రావడానికి ముఖ్యంగా చక్కెర, కొవ్వు సహకరిస్తాయి. యుక్త వయసులో కూడా అధికంగా చక్కెరల వినియోగం, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మొటిమలు వస్తుంటాయి.
- గర్భనిరోధక మాత్రలు – గర్భనిరోధక మాత్రలు తీసుకునే వారిలో చర్మంపై తీవ్రమైన ప్రభావం చూపి యుక్త వయసులో మొటిమలు రావడానికి కారణమవుతాయి.
ఇలా నిరోధిద్దాం..
- ఒత్తిడిని తగ్గించుకోవాలి.
- నిద్ర పోవడానికి ముందు ధ్యానం, యోగా చేయడం అలవర్చుకోవాలి.
- మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు సంగీతం వినాలి.
- సరైన సమయం నిద్ర పోయేలా చూసుకోవాలి.
- కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
- తలగడ సిల్క్‌గా ఉంటే మరీ మంచిది.
- పోషకాహారాలు తీసుకోవాలి.
- తాజా సీజనల్ పండ్లు, తాజా కొబ్బరి తింటూండాలి.
- సీ విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు తీసుకోవాలి.
చివరగా..
- హార్మోన్ల విడుదల మార్పులను గమనిస్తూ ఉండాలి.
- సబ్బులు, చర్మ సౌందర్య సాధనాలను గమనించాలి.
- వాడుతున్న కొన్ని రకాల మందులపై కన్నేయాలి.
- తింటున్న ఆహారాల్లో మార్పులు చేసుకోవాలి.
- కొవ్వులు, అధిక నూనె ఉండే ఆహారాలను దూరం పెట్టాలి.
- నీరు ఎక్కువ తాగుతుండటం అలవాటు చేసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.