టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. మరోవైపు హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఈ కేసులోని ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశాలున్నాయి.