తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
అయితే ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ దళపతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచారంలో దాదాపు ఎనబై మందికి పైగా ఎమ్మెల్యేలు.. మంత్రులను.. కార్పోరేషన్ చైర్మన్లకు బాధ్యతలను అప్పజెప్పారు. అంతేకాకుండా తాను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నుండి పర్యవేక్షిస్తూ మొత్తం బాధ్యతలను మంత్రులు కేటీఆర్,హారీష్ రావు.. స్థానిక జిల్లా మంత్రి అయిన జగదీష్ రెడ్డిలు చూసేలా ప్రణాళికను రచించారు. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుండి ఎన్నికల పోలింగ్ వరకు మంత్రులు కేటీఆర్,హారీష్ రావు కృష్ణార్జునల లెక్క అన్ని తామై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపుకు కృషి చేశారు. ఒక పక్క గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన.. చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూనే మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ చేసిన అవినీతి అక్రమాల.. దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో పూసగుచ్చినట్లు మునుగోడు ప్రజలకు ఆర్ధమయ్యే విధంగా వివరించడంలో వీరిద్దరూ విజయవంతమయ్యారు.
ఒకపక్క అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న ఇంచార్జులతో ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం.. అవసరమైతే హైదరాబాద్ కు రప్పించి మరి ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుని మరి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ.. క్యాడర్ కు స్థానిక ఓటర్లకు భరోసానివ్వడం లో విజయవంతమయ్యారు. ఏకంగా రోడ్ షోల ద్వారా మంత్రులు కేటీఆర్,హారీష్ రావు లు నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేయడమే కాకుండా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీలకు చెందిన నేతలను..కార్యకర్తలను ఆహ్వానించి లోకల్ గా ఉన్న ప్రస్తుత క్యాడర్ కు.. ఇతర పార్టీల నుండి వచ్చిన వారి మధ్య ఏలాంటి భేధాభిప్రాయాలు లేకుండా సమన్వయపరుస్తూ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడంలో తమదైన పాత్ర పోషించారు.
బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు పట్టు అయిన .. గెలుపు ఆశలు ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీ.. మండలంలో టీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అనే విధంగా ఓట్లను సాధించడంలో ఈ బావ బామ్మర్ధులు విజయవంతమయ్యారు. ఒకవైపు మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తుంటే మరో వైపు మంత్రి హరీష్ రావు నియోజకవర్గానికి చెందిన వివధ కులసంఘాల నేతలతో సమావేశమై గతంలో ఎలా ఉంది.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది అనే అంశం ఆధారంగా ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. అంతేకాకుండా మునుగోడులో ఉన్న చండూరు అభివృద్ధికి యాబై కోట్లు ఇస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించడం.. మునుగోడును దత్తత తీసుకుంటా అని మంత్రి కేటీఆర్ హామీవ్వడంలాంటి అనేక నిర్ణయాలు మునుగోడు బాద్షా టీఆర్ఎస్ అని నిరూపించారు ఈ కృష్ణార్జునులు. నియోజకవర్గంలో ఉన్న క్యాడర్ ను,ప్రచార బాధ్యతల్లో ఉన్న మంత్రులు.. ఎమ్మెల్యేలు.ఎమ్మెల్సీలు.ఇతర ముఖ్య నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు.