తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.నిన్న గురువారం ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.
మరో 686 పోస్టల్ ఓట్లు పోలయ్యాయని వెల్లడించారు.ఉపఎన్నికలో పోటీచేసిన 47 మంది అభ్యర్థుల భవితవ్యం ఈనెల 6న తేలనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈవీఎంలను నల్లగొండలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. పట్టణంలోనే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కౌంటింగ్ ఆఫీసర్లకు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని వివరించారు.