అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ మిలీ మూవీలో సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించిన జాన్వీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రతి రోజూ మైనస్ డిగ్రీలలో దాదాపు 16 గంటలు ఉండేవారిని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం జాన్వీ ప్రధాన పాత్రలో మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా మిలీ. మలయాళ సినిమా హెలెన్‌కు రీమేక్ రూపొందుతోంది ఈ మూవీ. ప్రముఖ నటి శ్రీదేవి భర్త, జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ చిత్రానికి నిర్మాత. నవంబరు 4(రేపు) ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న జాన్వీ మిలీ షూటింగ్ టైం తాను పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చింది.
ఈ సినిమాలో తనని తాను కొత్తగా చూపేందుకు ఇదో మంచి అవకాశంగా భావించిందట నటి జాన్వీ. మిలీ పాత్ర చాలా సవాళ్లు విసిరిందని చెప్పుకొచ్చింది. మిలీ తన తండ్రితో చేసిన మొదటి సినిమా అని తెలిపిందీ ముద్దుగుమ్మ. ఈ మూవీని మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో 22 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఇందుకోసం ఆమె దాదాపు 16 గంటలు ఫ్రీజర్‌లో ఉండేదంట. ఆయా సీన్స్‌లో నటించేందుకు చాలా ఇబ్బంది పడ్డా అని చెప్తోంది జాన్వీ.