టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగ్.. అదే జోష్‌ను తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు.
ఇక ఇటీవలే ఈయన ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్లకు సరిపడ కలెక్షన్‌లను కూడా సాధించలేకపోయింది. కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. పోటీగా గాడ్‌ఫాదర్ వంటి సినిమా ఉండటం కూడా ది ఘోస్ట్ చిత్రానికి ఒకింత కారణమనే చెప్పాలి.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రం గత రాత్రి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున ఇంటర్‌పోల్ అధికారిగా నటించాడు. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున తన కొడుకు అఖిల్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి గాడ్‌ఫాదర్ ఫేం మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నాడు.