గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. నదిపై ఉన్న వంతెన కూప్పకూలిన విషయం తీవ్ర విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని భరోసా ఇచ్చారు.
ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్‌లోని కేవడియాలో ఉన్నారు. అక్కడ ఉన్న ఐక్యతా ప్రతిమ వద్ద నుంచి ఈ ఘటనపై స్పందించారు. కేవడియాలో ఉన్నప్పటికీ తన దృష్టి అంతా మోర్బీ బాధితులపైనే ఉందని తెలిపారు. ఇలాంటి ఘోరం గురించి తెలిసి ఓ వైపు గుండె అంతా బరువెక్కిందని మరో వైపు తప్పక చేయాల్సిన విధులు ఉన్నాయని అన్నారు. ఆదివారం రాత్రే గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రమాదస్థలానికి చేరుకొన్నారని.. అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
మరోవైపు ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.