చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి పన్ను విధించలేదన్నారు. ఈమేరకు చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీని ఎత్తి వేయాలని ప్రధాని మోదీకి మంత్రి తలసాని పోస్ట్‌కార్డు పంపారు.
హైదరాబాద్‌లో మంత్రి తలసానిని కలిసిన చేనేత సంఘం ప్రతినిధులు.. జీఎస్టీ విధించడంతో కలిగే ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వ్యాపారం కాదని.. వృత్తి అని చెప్పారు. చేనేత వృత్తిదారుల్లో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని వెల్లడించారు.సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు.
చేనేతలను ఆదుకొనేలా సబ్సిడీపై ముడి సరుకులు ఇస్తున్నామని చెప్పారు. బతుకమ్మ చీరలను చేనేతల ద్వారా తయారు చేయించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. చేనేత కళాకారుడి నైపుణ్యం, సృజనాత్మకతపై ఆధారపడి ఈ రంగం మనుగడ సాగిస్తున్నదని తెలిపారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించడం తగదని పేర్కొన్నారు.