గుజరాత్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న తీగల వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. మృతుల్లో ఇప్పటివరకు 18 మంది చిన్నారులను గుర్తించారు. ప్రమాద సమయంలో 400 మందికి పైగా బ్రిడ్జిపై ఉన్నారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కేవలం 100 మందిని మాత్రమే యోయగల సామర్ధ్యం ఉంది. కానీ వంతెనపైకి 400 నుంచి 500 మందిని అనుమతించారు. అంతే కాకుండా ప్రమాద సమయంలో కొందరు ఆకతాయి చేష్టలు చేస్తూ బ్రిడ్జిని ఊపుతూ కనిపించారు. అక్కడున్న చాలా మంది వద్దని వారించినా వారు వినలేదు. ఆ వెంటనే కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న అందరూ నదిలో పడిపోయారు.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 20 అంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. బాధితుల ఆర్తనాదాలతో ప్రమాదస్థలి హృదయవిదారకంగా మారింది. ఘటన నుంచి క్షేమంగా బయటపడిన వారు తమ వారి గురించి బాధపడుతోన్న దృశ్యాలు అందర్ని కంటతడి పెట్టిస్తున్నాయి.