సాధారణంగా ట్రైన్ ఎంత పొడవుంటుంది? అరకిలోమీటరు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కొన్ని గూడ్స్‌రైళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. మహా అయితే కిలోమీటరు పొడవు ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రైన్ స్విట్జర్లాండ్‌లో పట్టాలెక్కింది.
ఆ దేశంలో రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చి 175 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలోమీటర్లుండే (సుమారు 2 కిలోమీటర్లు) ట్రైన్‌ను నడిపింది. 100 బోగీలు, 4 ఇంజిన్లు గల ఈ రైలు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పట్టింది. ప్రకృతి అందాలతో ఆల్ప్స్ పర్వత సానువుల గుండా సాగే ఈ మార్గంలో ప్రఖ్యాత ల్యాండ్‌వాసర్ వారధి సహా 22 సొరంగాలు, 48 వంతెనలు, అనేక లోయలు, మలుపుల్లోని దృశ్యాలను ప్రయాణికులు ఆస్వాదించారు.