ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను ప్రస్తుతం ఒక ఊపుతున్న తాజా సంచలనం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ రెడ్డి,గువ్వల బాలరాజు,బీరం హర్శ వర్ధన్ రెడ్డిలను కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం కొనుగోలు వ్యవహారం.
ఈ అంశాన్ని బట్టబయలు చేసిన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఉన్న 2+2 భద్రతను తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంఖ్యను 4+4కి పెంచింది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు.