తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో బీఆర్ అంబేద్కర్ మాల యువజన సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహుజన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ కల సాకారమైందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాల్లో అనుసరించే ముఖ్యమంత్రి.. దళితబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తున్నారని, దీంతో జీవితాల్లో సమూల మార్పుతీసుకురావడానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రూ.18 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడని విమర్శించారు. గత ఎన్నికల్లో గెలిచి ఏనాడు మునుగోడు నియోజకవర్గాన్ని, స్థానిక ప్రజలను పట్టించుకోని కోమటిరెడ్డి.. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి స్వార్థపరున్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.