‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని.. ఆ మూవీలో చిట్టి పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సోయగం ఫరియా అబ్దుల్లా. మొదటి నుండి సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’ చిత్రంలో నాయికగా నటించింది. సంతోష్‌శోభన్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భం గా శుక్రవారం ఫరియా అబ్దుల్లా పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు…
ఈ సినిమా కథలో మీకు బాగా నచ్చిన అంశాలేమిటి?
ట్రావెలింగ్ నేపథ్యంలో కథ నడుస్తుంది. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్‌గా కనిపిస్తారు. సొంత యూ ట్యూబ్ ఛానల్స్ ద్వారా తమ యాత్రా విశేషాల్ని షేర్ చేస్తుంటారు. ఈ సినిమాలో నేను వసుధ అనే ట్రావెల్ వ్లాగర్‌గా కనిపిస్తా. ప్రయాణ క్రమంలో హీరోని కలుస్తాను. ఆ తర్వాత వారి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
ట్రావెల్ నేపథ్య కథ కదా..షూటింగ్ సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
అడ్వంచర్స్ నేపథ్యంలో సాగే కామెడీ కథ ఇది. నలభైశాతం వరకు మారేడుమిల్లి, వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరిపాం. షూటింగ్ కోసం ఇరవై రోజులు అడవిలోనే ఉన్నా. కథానుగుణంగా యాక్షన్, ఛేజింగ్ సీన్స్ చాలా ఉంటాయి. మొత్తంగా ఈ సినిమా నాకు ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ లాంటి అనుభవాన్నిచ్చింది.
అభిమానులు మిమ్మల్ని ఇప్పటికీ జాతిరత్నాలు సినిమాలోని చిట్టి పేరుతోనే పిలుస్తుండటం ఎలా అనిపిస్తున్నది?
చిట్టి చాలా మందికి ఓ ఎమోషన్‌గా మారిపోయిది. ఆ సినిమాలో నా క్యారెక్టర్‌ను అందరూ ప్రేమించారు. ఓ నటిగా నా ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి కథను ఎంచుకున్నా వందశాతం న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా.
నటిగా భవిష్యత్తులోఎలాంటి లక్ష్యాల్ని నిర్దేశించుకున్నారు?
ఐదేళ్లలో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా. ప్రస్తు తం తమిళంలో సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఆయన నాపై ఎంతో గౌరవం చూపిస్తారు. 25 ఏళ్ల పాటు నేను ఇండస్ట్రీలో ఉంటానని ఆయన నాతో చెప్పడం సంతోషాన్నిచ్చింది.
కథాంశాల ఎంపికలో మీ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి?
నటిగా ఎలాంటి పరిమితులు విధించుకోలేదు. యాక్షన్, సూపర్‌నేచురల్, సైకో థ్రిల్లర్స్..అన్ని జోనర్స్‌లో సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం రవితేజ ‘రావణాసుర’, ఓ తమిళ చిత్రం, హిందీ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా.