ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విట్టర్‌ను 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 2013 నుంచి పబ్లిక్ కంపెనీగా ఉన్న ట్విట్టర్, ఒక ప్రైవేట్ కంపెనీగా మారిపోయింది. కాగా, ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్న గంటల వ్యవధిలోనే సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నెడ్ సెగల్‌ను తొలగించారు.
కాగా, ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మస్క్ ఇప్పటికే స్పందించారు. 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని స్పష్టం చేశారు.అయితే, పరాగ్ అగర్వాల్‌ను సీఈవో పదవి నుంచి తప్పిస్తే.. కంపెనీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సీఈఓగా నియమితులైన తర్వాత 12 నెలల్లోపు పరాగ్‌ను పదవి నుంచి తొలగిస్తే.. ఇందుకు 42 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.321 కోట్లు అన్నమాట.ట్విట్టర్‌కు మస్క్ ప్రకటించిన ఆఫర్ ధర ఒక్కో షేరుకు 54.20 డాలర్లుగా ఉంది. దీనికి తోడు కంపెనీకి సంబంధించిన ప్రాక్సీ స్టేట్‌మెంట్‌లోని నిబంధనలను ఆధారంగా సీఈఓకు చెల్లించే పరిహారం మొత్తం 42 మిలియన్ డాల్లరు ఉండవచ్చని రాయిటర్స్ అంచనా వేసింది. కాగా, పరాగ్ 2021 నవంబర్‌లో జాక్ డోర్సీ నుంచి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.