బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది.
బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్ చేయకుండా నేరుగా టెలీకాస్ట్ చేస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వినిపించారు. ఇలాంటి షోలు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ప్రసారం చేయాలని కానీ బిగ్‌బాస్ రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఈ మేరకు కోర్టు నాగ్, స్టార్‌మా ఎండీ, ఎండెమోల్ ఇండియా డైరెక్టర్, సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్, ఏపీ గవర్నమెంట్ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ వెంకటరమణలతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది.