ఒకప్పుడు ఇంగ్లీషు దొరలు తెలుగు వారిని పాలించారు. ఇప్పుడు అతి చిన్న వయసులో మన తెలుగోడు రిషి సునాక్ ఇంగ్లీష్ సామ్రాజ్యం బ్రిటన్‌కు ప్రధానమంత్రి అయ్యారు. దీనికి యావత్తు దేశం గర్విస్తోంది. ఇప్పటికే భారత్, ఆమెరికా, చైనాలతో పాటు ప్రపంచ దేశాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపాయి. మరి కొందరు తమ దేశాలతో మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరారు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం రిషి సునాక్‌కు అభినందనలు తెలియజేయలేదు. తాజాగా దీనిపై రష్యా అధ్యక్ష భవనం స్పందించి ఏం చెప్పిందంటే..
బ్రిటన్ ప్రస్తుతం రష్యాకు విరోధి దేశాల జాబితాలో ఉంది. అందుకే కొత్త అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేయలేదు అని రష్యా అధ్యక్ష భవనం నుంచి పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. రిషి సునాక్.. నేతృత్వంలో బ్రిటన్‌తో రష్యా సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఆయన అన్నారు.