గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల వైఫల్యంతో ధ్వంసమైన కుల వృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో … ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోశారు. ఒక్కొక్కరికి ఒక్కో పథకం అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ పథకానికి 2017లో శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలో అర్హులైన గొల్ల కురుమలందరికీ గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 3.68 లక్షల మందికి ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసింది. ఈ ఏడాది రెండో విడత 31 వేల మందికి పంపిణీ చేసింది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.5,064.42 కోట్లు ఖర్చు చేసింది.
లబ్ధిదారులకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయగా, వీటికి 1.35 కోట్ల పిల్లలు పుట్టాయి. మొదటి విడతలో ఒక్కో యూనిట్ (20+1)కు రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. అయితే మార్కెట్లో గొర్రెల ధర పెరగడంతో ప్రభుత్వం లబ్ధిదారులపై భారం పడకుండా ఒక్కో యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచింది.
11 వేల కోట్లు.. 7.61 లక్షల మంది అర్హులు
————————————
ఈ పథకం కోసం రూ.11 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు తగ్గట్టుగానే మొదటి విడతలో రూ. 5,064 కోట్లు ఖర్చు చేయగా, రెండో విడత కోసం రూ.6,125 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 8,109 గొర్రెల, మేకల పెంపకం దారుల సొసైటీలు ఉండగా, వీటిలో 7,61, 895 మంది సభ్యులున్నారు. వీరందరికీ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయనున్నది.
అత్యధిక గొర్రెలు తెలంగాణలోనే..
—————————————
గొర్రెల పంపిణీ పథకం గొల్ల కురుమల ఆదాయాన్ని పెంచడంతోపాటు రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచింది. ఈ పథకం అమలు తర్వాత దేశంలో అత్యధిక గొర్రెలున్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ 1గా నిలిచింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో గొర్రెల సంఖ్య 1.28 కోట్లు కాగా, ఇప్పుడు ఇది 1.91 కోట్లకు పెరిగింది. ఈ లెక్కలు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం గమనార్హం. ఈ పథకం ద్వారా సుమారు రూ.7 వేల కోట్ల సంపద సృష్టించడం విశేషం. గొర్రెల పంపిణీ ప్రారంభం తర్వాత 1.22 లక్షల టన్నుల మాంసం మార్కెట్లోకి వచ్చింది. అదే విధంగా 2014-15తో పోల్చితే రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి 106.29 శాతం పెరిగింది..