తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న పాల్వాయి స్రవంతి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అదే పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ప్రస్తుత భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడైన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఈ సందర్భంగా ఆమె నిప్పులు చెరిగారు. వెంకట్ రెడ్డి ఓ దుర్మార్గుడు అని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పక్కన పెట్టాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేయడం ఎంత వరకు సరైనది అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. బంధాలకతీతమే రాజకీయాలు.. నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే.. పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. తమ్ముడి గెలుపే ముఖ్యమైతే.. కాంగ్రెస్ కండువాను తీసి పక్కనపెట్టి, బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలని ధ్వజమెత్తారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని ఆమె నిలదీశారు.