దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నాడు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని చెబుతారు.
దీనిని యమ దీపం అంటారు. ఈ దీపారాధన చేసిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. తల్లిదండ్రులు గతించిన వారు మాత్రమే యమ దీపం పెడుతుంటారు.నరక చతుర్దశి నాడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.
సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అమావాస్య మర్నాడు కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమిగా చేసుకుంటారు. విదియ నాడు యమ ద్వితీయగా చేసుకుంటారు. ఆనాడు అన్నాదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల చేతి వంట తినాలనే నియమం ఉంది. ఏడాదికి ఒకసారైనా సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు విచారించాలని ఈ పండుగ తెలియజేస్తుంది.