బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. నితీశ్‌కుమార్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఆరోపించగా.. వయసు మీద ఉన్న ప్రశాంత్ కిషోర్ ఏదైనా మాట్లడగలడు అని నితీశ్‌కుమార్ ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో ఇవాళ ట్వీట్ ద్వారా ప్రశాంత్ కిషోర్ మరోసారి నితీశ్ కుమార్‌ను సవాల్ చేశారు. మీకు నిజంగా బీజేపీతో సంబంధాలు లేకుంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మీ పార్టీ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎందుకుంటారని పీకే ప్రశ్నించారు. మీరు చెప్పేది నిజమైతే హరివంశ్‌తో పదవికి రాజీనామా చేయంచండి, ఆయన రాజీనామాకు ఒప్పుకోకపోతే చర్యలు తీసుకోండి అని సూచించారు.
నితీశ్‌కుమార్ మహాకూటమి సర్కారును ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమేనని, అయితే ఆయన ఇంకా బీజేపీతో సంబంధాలు కొనసాగించడం కరెక్ట్ కాదని పీకే విమర్శించారు. రెండు దారుల్లో పయనం అన్ని వేళలా పనికిరాదని హితవు పలికారు. కాగా, అక్టోబర్ 21 నాటికి నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి 17 సంవత్సరాలు అయ్యింది. అందులో 14 ఏండ్లు బీజేపీతో కలిసే సంకీర్ణ సర్కారును నడిపారు.